Tuesday, June 2, 2026
spot_img

Telangana @ 12 | పుష్కర కాలమైనా.. ఉద్యమ ఆకాంక్షలు నెర‌వేర‌లే!

Telangana @ 12 | తెలంగాణ‌.. స‌బ్బండ వ‌ర్గాల పోరాటాల‌కు ప్రతీక‌. ద‌శాబ్దాల ఉద్య‌మ చరిత‌కు నిలువెత్తు సాక్ష్యం. అమ‌రుల‌ త్యాగాలతో సిద్ధించిన ఆ చారిత్ర‌క ఘ‌ట్టానికి నేటికి ప‌న్నెండేళ్లు. పాల‌కులు మారినా.. పుష్క‌ర‌కాలం దాటినా ఉద్య‌మ ఆకాంక్ష‌లు నెరవేర‌లే. ప‌రాయి పాల‌న‌లో ద‌గాప‌డ్డ బ‌తుకులు స్వ‌రాష్ట్రంలోనూ బాగు ప‌డ‌లే. నాడు ప్ర‌త్యేక రాష్ట్ర రాక‌తో మూగ‌బోయిన ఆ గొంతుక‌లు మ‌ళ్లీ ప్ర‌తిధ్వ‌నిస్తున్నాయి. పాల‌కుల తీరుపై పిడికిలెత్తేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ముక్కోటి గొంతుక‌గా..
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ట్యాగ్‌లైన్‌తో ప్రత్యేక రాష్ట్ర పోరు మొదలైంది. ప్రాంతీయ వివక్షకు వ్యతిరేకంగా సాగింది. దశాబ్దాలుగా అణచివేయబడిన అస్తిత్వ సాధన, ఆత్మగౌరవ పునరుద్ధరణ, సామాజిక న్యాయం కోసం ముక్కోటి గొంతుక నినదించింది.
మలుపుతిప్పిన మలిదశ
తొలిదశ ఉద్యమం 1969లో ప్రారంభమైంది. సుమారు 350కు పైగా యువత‌ పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు. నాటి ప్ర‌భుత్వం ఉద్యమాన్నిఅణ‌చివేయ‌గా ప్రత్యేక ఆకాంక్ష మ‌రింత బ‌లంగా మారింది . భువ‌న‌గిరి బ‌హిరంగ స‌భ అనంత‌రం ప‌రిణామ‌ల నేప‌థ్యంలో నాడు డిప్యూటీ స్పీకర్ గా కొన‌సాగిన కేసీఆర్‌(KCR) త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) స్థాపించారు. పార్టీ ఏర్పాటుతో ఉద్యమం రాజకీయ మలుపు తీరిగింది. మలిదశలో సబ్బండ వర్గాలు పిడికిలెత్తాయి. పోరుబాటలో సై అని జై కొట్టాయి. ఈక్ర‌మంలో 2009లో కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగివ‌చ్చింది. డిసెంబర్ 9న అప్పటి హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రతిఘటన రావడంతో కేంద్ర స‌ర్కారు వెన‌క్కి త‌గ్గింది. దీంతో తెలంగాణ‌లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిప‌డింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. సకలజనుల సమ్మెతో యూపీఏ ప్రభుత్వం దిగివ‌చ్చింది. 2013లో తెలంగాణ ఏర్పాటును వేగవంతం చేసింది. పార్లమెంటులో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లును 2014 ఫిబ్రవరి 14న ప్రవేశపెట్టారు. అదే రోజు ఆమోదం పొందగా.. ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. మార్చి 1న ప్రెసిడెంట్ (రాష్ట్ర‌ప‌తి) సంతకం చేశారు. 2న గెజిట్‌లో పొందుపర్చారు. ఫైన‌ల్‌గా 2024 జూన్ 2ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినంగా ప్రకటించారు.
పుష్క‌ర‌కాలంలో ఏమైంది..
నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదంతో తెచ్చుకున్న స్వ‌రాష్ట్రంలో 12 ఏళ్లు దాటినా ఈ ప్రాంత‌వాసుల ఆకాంక్ష‌లు నెర‌వేర‌లేద‌ని తెలుస్తోంది. నీళ్లు, నిధుల విష‌యంలో కొంత పురోగ‌తి సాధించినా నియామ‌కాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి ప్ర‌జ్వ‌రిల్లింది. ఈ క్ర‌మంలోనే ప‌దేళ్ల పాల‌న సాగించిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌( అప్ప‌టి టీఆర్ఎస్‌)ను ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం చేశారు. నిరుద్యోగ డిక్ల‌రేష‌న్‌, జాబ్ క్యాలెండ‌ర్ వంటి కీల‌క హామీల‌తో యువ‌త‌ను ఆక‌ర్షించిన హ‌స్తం పార్టీకి 2023లో అధికారం ద‌క్కింది. అయితే రెండున్న‌రేళ్లు గ‌డిచినా నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌క‌పోవ‌డంతో వారిలో అస‌హ‌నం పెరిగింది. ఇంకెన్నాళ్లు అంటూ నిర‌స‌న గ‌ళం మొద‌లైంది. పోరుబాట‌లో ముందు న‌డిచి ఆత్మ బ‌లిదానాల‌కు సైతం వెనుక‌డుగు వేయ‌ని విద్యార్థి, నిరుద్యోగ లోకాన్ని విస్మ‌రిస్తే త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. మ‌రోవైపు అమ‌రుల కుటుంబాలు, ఉద్య‌మ‌కారుల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర‌క‌పోవ‌డంతో ఆయా వ‌ర్గాలు సైతం పాల‌కుల‌పై గుర్రుగా ఉన్నాయి. క‌మిటీల‌తో కాల‌యాప‌న కాకుండా ప‌రిష్కారంపై చొర‌వ‌చూపాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి. అయితే ప్ర‌స్తుత  రేవంత్ స‌ర్కారు ఈ ఆవిర్భావ దినోత్స‌వం రోజున ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తుందో వేచి చూడాల్సిందే మ‌రి.

ఇది కూడా చ‌ద‌వండి.. జూన్ 1 నుంచి మార్పులివే.. ఓ లుక్కేయండి

spot_img

Hot Topics

Related Articles