Monday, April 13, 2026
spot_img

kavitha party | ఆమె అడుగులు.. వ్యూహాత్మ‌కం!

kavitha party | ప‌శ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు తీవ్ర‌మ‌వుతుండ‌గా .. తెలంగాణ‌లో పొలిటిక‌ల్ వార్ మొద‌లైంది. ఈనెల 25న కొత్త పార్టీగా రాబోతున్న‌ట్లుగా క‌విత ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జాతీయ పార్టీలే ఉన్నాయ‌ని తాము ‘తెలంగాణ’ ఆత్మ‌గా ఇంటి పార్టీగా రాబోతున్నామ‌ని వెల్ల‌డించారు. మ‌రోవైపు ఆమె వ్యూహాత్మ‌క అడుగులు రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆలోచింప‌జేస్తున్నాయి.

పేరుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌..
బీఆర్ఎస్ నుంచి దూర‌మైన జాగృతి క‌విత ప్ర‌జా స‌మ‌స్య‌లే ఎజెండాగా పార్టీ ఏర్పాటుపై దృష్టి సారించగా.. ఆ పేరుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌ మొద‌లైంది. ఈసీ వ‌ద్ద ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా న‌మోదైనట్లుగా లీకులొచ్చాయి. అయితే క‌విత ఇటీవ‌ల మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా ‘బీఆర్ఎస్ గా మారిన తర్వాత ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. దానిని ఎవరైనా వాడుకోవచ్చని..’ చేసిన కామెంట్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలో కొత్త‌ పార్టీ టీఆర్ఎస్‌గా ఉంటుంద‌నే మీడియా క‌థ‌నాలు బీఆర్ఎస్‌లో చ‌ర్చకు దారితీశాయి. అయితే కేటీఆర్ తాజాగా చిట్‌చాట్‌లో తాము బీఆర్ఎస్‌తో న‌ష్ట‌పోయామ‌ని త్వ‌ర‌లో టీఆర్ఎస్‌గా మార‌బోతున్న‌ట్లు చేసిన కామెంట్ రాజ‌కీయవ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.
అన్నిపార్టీల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు..
పార్టీ అధినేత్రిగా రానున్న త‌రుణంలో క‌విత‌ పాల‌క పార్టీల‌తో పాటు విప‌క్షాల‌పై విమ‌ర్శ‌ల దాడి పెంచారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌ను ఎండ‌గ‌డుతున్నారు. మ‌రోవైపు కేంద్రంలో బీజేపీ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను తూర్పార ప‌డుతున్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆర్ఎస్‌నూ వ‌ద‌ల‌డం లేదు. ఆ పార్టీ ప్ర‌స్తుతం నిద్రావ‌స్థ‌లో ఉంద‌ని సెటైర్లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌నం గొంతుక‌గా వ‌స్తున్న ఆడ‌బిడ్డ‌ను ఆద‌రించి అక్కున చేర్చుకోవాల‌ని ప్రజలను కోరుతున్నారు. పార్టీ ఆవిర్భావానికి అన్ని వ‌ర్గాలు త‌ర‌లిరావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.
విధి విధానాల‌పై సమాలోచ‌న‌లు
స్వ‌యంగా కేసీఆర్ కుమార్తె అయిన క‌విత ఆలోచ‌న‌లు తండ్రిని పోలి ఉంటున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కొత్త పార్టీ విధి విధానాల‌పై ఆయా రంగాల నిపుణుల‌తో ఆమె సుదీర్ష‌ చ‌ర్చ‌లు అంద‌రినీ ఆలోచింప‌జేస్తున్నాయి. ‘ప్ర‌జా స‌మ‌స్య‌లే ఎజెండాగా.. ప్ర‌శ్నించ‌డమే ల‌క్ష్యంగా’ త‌మ పార్టీ ముందుకు సాగుతుంద‌ని ఆమె ఇదివర‌కే ప్ర‌క‌టించ‌డంతో ఆవిర్భావ స‌భ‌పై అంద‌రి దృష్టి ప‌డింది.

ఇది కూడా చదవండి : స‌గం అయినట్లే.. ఇక పార్టీల చూపు.. ఎన్నికల వైపు!

spot_img

Hot Topics

Related Articles