Sunday, March 8, 2026
spot_img

ఆరు కలిసొచ్చేనా.. ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా.. కొత్త పార్టీ అదే రోజు ఆవిర్భవించేనా?

పిడికిలెత్తిన ఆ తిరుగుబావుటా.. ఉక్కు సంకల్పమై ఉరిమే సమయం ఆసన్నమైనట్లేనా.. గ్రహణం వీడిన ఆ ‘చంద్ర’ తనయ భగభగ మండే ఆ సూర్యుని సాక్షిగా ‘తెలంగాణ జాగృతి’గా ఉదయించబోతున్నారా.. కార్మికుల పండుగ రోజున పార్టీగా రాబోతున్నారా.. తన లక్కీ నంబర్ కలిసి వచ్చే ముహూర్తం ఖరారైనట్లేనా.. కవిత మదిలో ఏముందో మరి.
*******
ప్రపంచ కార్మికులు నినదించే రోజది. తెలంగాణ రాజకీయాల్లోనూ కీలకం కానుందా.. అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి తాజా పరిస్థితులు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేయగా.. ఆమె దీటుగా స్పందించిన తీరు తెలిసిందే. రాజీనామా అస్త్రంతో పిడికిలెత్తిన ఆమె సభ్యత్వంతో పాటు పదవిని సైతం వీడారు. ఆ పార్టీ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేశారు. మరో వైపు జిల్లాల బాట పట్టి ప్రజా సమస్యలపై ఫోకస్ పెంచారు. పాలకుల తీరును ఎండగడుతూ జనం గొంతుకగా మారారు. ‘కారు’ కూతలను ఓవర్టేక్ చేస్తూ ఆత్మగౌరవం దక్కని ఉద్యమకారులకు తోడుగా.. పింఛన్ బాంచన్ అంటూ ఎదురుచూస్తున్న అవ్వలకు బిడ్డగా.. తెలంగాణ వచ్చినా కొలువులు దక్కక దగాపడ్డ నిరుద్యోగ అన్నలకు చెల్లెగా.. కష్టాల సాగులో కన్నీరు కారుస్తున్న అన్నదాతకు అండగా తానున్నానంటూ వేసిన ఒక్కో అడుగు పోరు పుస్తకంలో కొత్త పేజీలుగా మారాయి.
కడిగిన ముత్యంలా జనజాగృతి లోకి
నమ్మిన కర్మ సిద్ధాంతం.. న్యాయస్థానంలో దక్కిన ఊరట.. సత్యమేవ జయతే అంటూ వెల్లివిరిసిన ఆ ఆనంద క్షణాలు ఆమెలో మరింత పట్టుదలను బిగించాయి. శుక్రవారం కోర్టు తీర్పు దేశమంతా మారుమోగింది. రాజకీయ కక్షగా పట్టిన గ్రహణం వీడినట్లయింది. కుటుంబం దూరమైనా ఎల్లలెరుగని సబ్బండ వర్గాల నుంచి వచ్చిన ఆత్మీయ అభినందనలు వెయ్యి ఏనుగుల బలనిచ్చాయి. హితులు, సన్నిహితుల నుంచి వచ్చిన ఆ స్పందన ఆనంద బాష్పమైంది. యాదృచ్ఛికమైన ఆమె జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన రోజు ఆగస్టు 27కాగా కోర్టు తీర్పు ఫిబ్రవరి 27 కావడం విశేషం.
చారిత్రాత్మక రోజు.. చరిత్ర సృష్టించ బోతున్నారా
కేసీఆర్ తో పాటు కవిత లక్కీ నెంబర్ కూడా ఆరు. పార్టీ అనౌన్స్మెంట్ కూడా అదే రోజు ఉంటుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జాగృతి అధ్యక్షురాలు మే మొదటి వారంలో కీలక ప్రకటన ఉంటుందని వెల్లడించిన నేపథ్యంలో కార్మికుల దినోత్సవం అయిన ఒకటో తారీకు ప్రాధాన్యత సంతరించుకుంది. (1+5=6) కాగా ఆరోజున శుభ ముహూర్తం కూడా ఉండడం గమనార్హం.

spot_imgspot_img

Hot Topics

Related Articles