ఖుల్లంఖుల్లా: kavitha vijayashanthi | తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని ఒకరు..పోరు బిడ్డలను విస్మరిస్తున్నారని మరొకరు ‘మండలి’ వేదికగా గొంతెత్తారు. ఇందులో ఒకరు జాగృతి అధ్యక్షురాలు కవిత కాగా మరొకరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. ఇప్పటికే కవిత బీఆర్ఎస్ వీడి సొంత కుంపటిని సిద్ధం చేసుకుంటుండగా.. ఫైర్ బ్రాండ్ రాములమ్మ తాజాగా సొంత పార్టీ పైనే విమర్శనాస్త్రాలు సందించడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు ఒక్కతావుతారా.. తెలంగాణ రాజకీయాల్లో మహిళా శక్తిని చాటుతారా.. అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.
kavitha vijayashanthi | ఇద్దరూ ఉద్యమకారులే..
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతో ప్రస్థానం ప్రారంభించిన కవిత ఇటీవల జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన అనంతరం మండలి వేదికగా చేసిన ఆమె చివరి ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తాను ప్రస్తుతం ‘ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా తిరిగి చట్టసభల్లోకి వస్తానని’ శపథం చేసిన విషయం విధితమే. అనుకున్నట్లుగానే ఆమె తన రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 25న పార్టీ ప్రకటన చేస్తానని ఇప్పటికే ఆమె వెల్లడించారు కూడా. ఇందులో భాగంగా జాగృతి శ్రేణులతో పాటు కలిసి వచ్చే నేతలతో ఆమె పూర్తిస్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు.
kavitha vijayashanthi | విజయశాంతి రాజకీయ ప్రస్థానం
సినీ రంగంలో లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి రాజకీయ అరంగేట్రం 1998లో బీజేపీతో మొదలైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2005లో ‘తల్లి తెలంగాణ’ పార్టీ ప్రారంభించిన ఆమె అనంతరం టీఆర్ఎస్ లో విలీనం చేశారు. ఆ పార్టీతో కలిసి కొంతకాలం పనిచేసిన ఆమె 2009లో మెదక్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఏమైందో ఏమో 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నావంటూ విజయశాంతి పై గులాబీ బాస్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఆమె 2014లో కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరిగి 2020లో కమలం గూటికి చేరువయ్యారు. అక్కడ ఇమడలేక 2023లో హస్తం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆమె తాజాగా మండలి వేదికగా కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. ఉద్యమకారులకు న్యాయం చేయాలని సొంత ప్రభుత్వం పైనే విమర్శనలు ఎక్కు పెట్టడం ఆసక్తి కలిగిస్తుంది.
kavitha vijayashanthi | కవితమ్మతో రాములమ్మ కలిసి నడుస్తారా
ఉద్యమ ఆకాంక్షలే లక్ష్యంగా తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కవిత కొత్త పార్టీని త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో విజయశాంతి మండలిలో తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనున్న క్రమంలో తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి నడుస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా,రాష్ట్రంలో సొంత ఇమేజ్ కలిగి ఉన్న ఈ ఇద్దరూ బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురి అయిన వారూ కావడం గమనార్హం.
దీనిని కూడా చదవండి : కళ్ల ముందున్నా.. కలవనంత దూరమాయే! తండ్రి ఆజ్ఞ.. బిడ్డ ప్రతిజ్ఞ..ఆ తల్లికి మాత్రం తప్పని క్షోభ!




