kavitha party | జై తెలంగాణ.. నాడు పది జిల్లాల నినాదం. స్వరాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఐక్యం చేసిన వజ్రాయుధం. మలి దశ పోరుతో సిద్దించిన దశాబ్దాల స్వప్నం. జనం ఆకాంక్షకు అద్దం పట్టేలా ఆ పేరుతో పుట్టిన ఉద్యమ పార్టీకి కలిసాచ్చింది కూడా. రెండు పర్యాయాల ఏలుబడే నిదర్శనం. సీన్ కట్ చేస్తే.. మళ్లీ అదే సెంటిమెంట్ తో రాష్ట్రంలో మరో పార్టీ పురుడు పోసుకునేందుకు రంగం సిద్ధమైంది. దీనికి నేతృత్వం వహిస్తున్నది ఎవరో కాదు.. మలిదశ ఉద్యమ పితగా పేరుగాంచిన కేసీఆర్ తనయ. తాజాగా కవిత కొత్త పార్టీతో జనం ముందుకు రాబోతున్నారు. నవమి రోజున స్వయంగా జాగృతి అధ్యక్షురాలు విషయాన్ని ప్రకటించగా.. జనం హారతి ఇచ్చే తీరు ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
kavitha party | బతుకమ్మ తో మొదలైన ప్రస్థానం..
కవిత రాజకీయ ప్రస్థానం బతుకమ్మ(bathukamma) తోనే మొదలైంది. ఉద్యమ సమయంలో ఈ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే పూలసింగిడికి ఆమె పూర్వ వైభవం తీసుకొచ్చారు. జాగృతి వేదికగా పోరు బాట పట్టి ఉయ్యాల పాటలను ఊరురా మారు మోగించారు. ఢిల్లీ పెద్దలతో నాటి ఉద్యమ నేతను సమన్వయపర్చడంలో కీలక పాత్ర పోషించారు. స్వరాష్ట్ర సాధనలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు.
kavitha party | రాజకీయ అరంగేట్రం
మెట్టినిల్లు అయిన నిజామాబాద్ నుంచి ఎంపీగా పొలిటికల్ అరంగేట్రం చేసిన కవితకు రెండోసారి మాత్రం చేదు అనుభవం ఎదురయింది. ఎమ్మెల్సీగా వచ్చిన అవకాశం చివరకు రాజీనామాతో బ్రేక్ పడింది.
kavitha party | బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి
రెండోసారి ఓటమి వైఫల్యాలపై లేఖాస్త్రం సంధించిన ఆమెపై అధిష్టానం కన్నెర్ర జేసింది. సస్పెన్షన్ వేటువేయగా.. అంతే దీటుగా ఆమె రాజీనామాస్త్రాన్ని ప్రయోగించారు. రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని మండలిలో ప్రతీనభూనారు. నాటి ఉద్యమ పాఠాలతో జనం బాట పట్టారు. సర్కారు తీరును ఎండగడుతూనే కన్నీటికి తోడయ్యారు. బాధితులకు భరోసాగా నిలిచారు.
kavitha party | జైలుకెళ్లి..తిరిగొచ్చాక
లిక్కర్ కేసులో జైలు(jail) కెళ్లిన ఆమె తాజాగా కోర్టు తీర్పు వచ్చాక సత్యమేవ జయతే అంటూ నినదించారు. తాను ఏ తప్పు చేయలేదని.. చేయబోనని స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలకు తాను బలయ్యానని చెప్పుకొచ్చారు. సామాజిక తెలంగాణ తన లక్ష్యమని.. రాజకీయ పార్టీగా వచ్చి సాధిస్తానని పిడికిలెత్తారు.
kavitha party | ఇందూరు నుంచి కీలక ప్రకటన
తన అత్తగారిల్లు అయిన నిజామాబాద్ నుంచి నవమి రోజున తన పార్టీపై కవిత కీలక ప్రకటన చేశారు. సస్పెన్స్ కు తెరదీస్తూ వచ్చేనెల 25న హైదరాబాద్ వేదికగా పార్టీ విధి విధానాలు ప్రకటిస్తానని వెల్లడించారు.
kavitha party | తెలంగాణ ప్రజల గొంతుకగా..
తెలంగాణ ప్రజా గొంతుకగా.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ఇంటి పార్టీగా రాబోతున్నామని అన్ని వర్గాల ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకోవాలని కోరారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటిస్తామని వెల్లడించారు.




