Sunday, April 12, 2026
spot_img

Be possitive | డాడీ నిన్ను చూడాల‌నిపిస్తుంది.. మమ్మీ అని పిల‌వాల‌నిపిస్తుంది!

Be possitive | ఆ క్ష‌ణం క‌న్నీటి పొర నా దృష్టికి తెరవేసింది.. మెద‌డును మొద్దుబార్చింది. గుండెను రాయిలా మార్చేసింది. ఉద‌యం చెవిని తాకిన ఆ వైఫల్యపు వార్త నా జీవితానికి చరమగీతం పాడింది. క్షణికావేశం మీకు కడుపుకోతగా.. నాకు తీరని వ్యథగా మిగిల్చింది. చదువే సర్వస్వం అనుకునే నేను చివరికి నన్నే కోల్పోవాల్సి వచ్చింది. ఇప్ప‌టికీ ఏడాద‌వుతుంది డాడీ మీకు దూరమై. అమ్మ ఎలా ఉంది.. అక్క బాగుందా.. ఈ రోజు త‌మ్ముడి రిజ‌ల్ట్ అంట క‌దా.. టెన్ష‌న్ ప‌డ‌క‌ను. మార్కులే జీవితం కాద‌ని చెప్పు. వాడి భ‌విష్య‌త్‌కు భ‌రోసా ఇవ్వు. నా మాటగా చెప్పు.

చివరి ప్రయాణం మరచిపోలేక పోతున్నా
నా మీద మీ ప్రేమ‌ను ఆ దేవుడు చూడ‌లేక‌పోయాడేమా.. అందుకే న‌న్ను మీ నుంచి దూరం చేసిన‌ట్లున్నాడు. ఆ రోజు విగ‌త జీవిగా న‌న్ను చూసిన నువ్వు.. “ఎక్క‌డికి పోయిన‌వ్ త‌ల్లీ” అంటూ వెక్కివెక్కి ఏడ్వ‌డం నేను పుట్టిన‌ప్ప‌టి నుంచి చూడ‌లే డాడీ. నా మీద ప‌డి మ‌మ్మీ సొమ్మ‌సిల్లడం చూసి లేపాల‌నిపించింది. కానీ, నా శక్తి స‌రిపోలే. ఫ్రెండ్స్‌ అంతా “మ‌మ్మ‌ల్ని వ‌ద‌లిపోయావా” అంటూ క‌న్నీటితో చేసిన చివ‌రి ప్ర‌యాణం యాదికొస్తనే ఉంది.
తొందరపడకండి..
డాడీ ఎంతో మందికి గైడెన్స్ ఇచ్చే మీరు న‌న్నెందుకు మార్చ‌లేక‌పోయారు. నా మొండిత‌నం, సున్నిత‌త్వం మీకే ఎక్కువ తెలుసు. నేను బాధ‌ప‌డుతా అనుకున్నారా? అదే కాబోలు. అందుకే ఒక్క‌మాట కూడా అన‌లేదు. మార్కులే జీవితం కాదు అని మీరు ప‌దేప‌దే చెప్పినా నేనే వినిపించుకోలేదు. మీ ఆశ‌ల‌ను నెర‌వేర్చ‌లేక‌పోయా అని భ‌య‌ప‌డ్డా. తొంద‌ర‌ప‌డ్డా. ఆ బలహీన క్ష‌ణం ఖ‌రీదు నా నిండు ప్రాణం. మీకు దూర‌మై నేటికి ఏడాది. ఇక్కడ పలకరించే వాళ్లు లేరు.. తినమని బతిమలాడే మీరు లేరు. ఒంట‌రిగా శూన్యంలో ఉంటున్నా.. ఏడువని రోజులేదు.. డాడీ నిన్ను మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది.. మ‌మ్మీని గ‌ట్టిగా హ‌త్తుకుని ఏడ‌వాల‌నిపిస్తుంది. ఫ్రెండ్స్.. ఒక్క‌టి మాత్రం నిజం.. మార్కులు అంటూ నాలాగా తొంద‌ర‌ప‌డ‌కండి. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోకండి క‌న్న‌వారికి క‌డుపుకోత మిగ‌ల్చ‌కండి.

( ఇంటర్ ఫ‌లితాల వేళ గ‌తేడాది త‌నువుచాలించిన ఓ అమ్మాయి ఆత్మ‌ఘోష‌కు అక్ష‌ర‌రూపం)

spot_img

Hot Topics

Related Articles