పల్లె, పట్టణ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార పార్టీ మరో ఎన్నికలకు సిద్ధమవుతుందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా పరిషత్ పై కాంగ్రెస్ ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. హస్తం పెద్దల ఢిల్లీ టూర్.. తాజా పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి..
క్యాబినెట్లో నిర్ణయించేనా..
ఇప్పటికే వరుస ఎన్నికలతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ
పరిషత్ లోనూ సత్తా చాటాలని ఉవ్విల్లూరుతుంది. ఇదే సరైన సమయం గా భావిస్తుంది. ఇందులో పల్లె ఓటర్లే ఉంటారు కాబట్టి రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాలో వేసేందుకు సిద్ధమైంది. ఈనెల 23న నిర్వహించనున్న క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే త్వరలోనే పదో తరగతి పరీక్షలు ఉన్న నేపథ్యంలో అవి ముగిశాక వెళ్తారా.. ముందే ముగిస్తారా అనేది అక్కడే ఖరారు కానున్నట్లుగా తెలుస్తుంది.
సీఎం మదిలో ఏముంది
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ళవుతుంది. ఓవైపు ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన జూబ్లీహిల్స్ తో పాటు గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో దూసుకెళ్లిన ‘హస్తం’ పార్టీ అదే ఊపు కొనసాగించాలని భావిస్తుంది. ఇప్పటికే ఎంపీటీసీ, జెడీపీటీసీ ల పదవి కాలం ముగిసి ఏడాది దాటింది. మరోవైపు కేంద్రం నుంచి వచ్చిన నిధులు మార్చి చివర్లోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేకుంటే తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఈ తరుణంలో పరిషత్ వైపు వెళితేనే బాగుంటుందని సీఎం మదిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.


